గమనం
ఈగ... ఓనమాలు...
- తెలకపల్లి రవి
సమస్య ఏమంటే కోటానుకోట్లు పెట్టి తీసిన ఫార్ములా చిత్రాలు బోల్తా పడినా మళ్లీ వాటి వెంటే పరుగులు పెడుతుంటారు గాని సమాంతర ధోరణిలో తీసిన చిత్రం ఒకటి విఫలమైతే మొత్తం అలాంటి వాటికే ఎసరు పెడతారు. ఇలాంటప్పుడే ఈగ మళ్లీ తన పేరు గుర్తు చేసుకుని ఓనమాలు దిద్దుకోవలసిన అవసరం కనిపిస్తుంది. హిందీ, తమిళ భాషలలో జరిగే పాటి ప్రయోగాలైనా మనం చేసేందుకు ఈ విజయాలు ప్రేరణనిస్తే ఆనందించవచ్చు.
తెలుగు చిత్ర రంగం సత్తా ఏమిటనే దానిపై ఎప్పటికప్పుడు భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నా వివిధ రూపాల్లో అది నిరూపితమవుతూనే ఉంది. మగధీర తోనే కాదు, ఈగ ధీరతోనూ వసూళ్ల వర్షం కురిపించగలమని నిరూపించిన రాజమౌళి ఉదాహరణ ఒకటైతే.. మానవత్వపు ఆనవాళ్ల ఓనమాలు చూపించిన తొలి చిత్ర దర్శక నిర్మాత క్రాంతి మాధవ్ మరో ఉదాహరణ. వారి వారి తరహాలు, అనుభవాలు వేరైనా రెండూ చెప్పుకోదగినవే.
ఈగ తర్వాత రాజమౌళి ఇంటర్వ్యూలు మీడియాలో వ్యాఖ్యలు చాలా ప్రశంసా పూర్వకంగా ఉన్నాయి. అందులో పునర్జన్మ వంటి నమ్మకాలు తీసేస్తే (తీసేయక తప్పదు. లేకపోతే మూగమనసులు వంటి మంచి చిత్రాన్ని కూడా వదులుకోవలసి ఉంటుంది) చిన్న ఫార్ములాతో ఆయన విజయం సాధించడం విశేషమే. కొద్దిసేపు నానీ కనిపించినా ప్రధానంగా సుదీప్ చిత్రాన్ని పట్టుగా నడిపించడానికి ప్రధాన కారణమయ్యారు. అయితే రాజమౌళి సత్తాకు ఈగ కన్నా మర్యాద రామన్న మంచి ఉదాహరణ అని నేననుకుంటాను. సునీల్ హీరోగా కొత్త నటుడు విలన్‌గా ఒక చిన్న అంశంతో నేటివిటినీ సృష్టించి అంత విజయం సాధించడం అరుదైన విశేషం.
అందులో అమ్మోరికి ఆకలి గురుతొచ్చే పాటను ఉపయోగించుకున్న తీరు చాలా బాగుంటుంది. అదే ఈగకు వచ్చే సరికి గ్రాఫిక్స్ విధ్వంసాలు ప్రధానమై పోయాయి. శంకర్ 'అపరిచితుడు' చిత్రంతో రికార్డు సృష్టించినపుడు 'అతి పరిచితుడు' అని నేను ఇదే కాలమ్‌లో రాశాను. ఏమంటే ప్రాచీనతా పునరుద్ధరణకు ప్రపంచీకరణకు మధ్య నలిగిపోతున్న సగటు భారతీయుడికి ఆ నమూనా అచ్చంగా సరిపోయింది. అదే శివాజి, రోబో చిత్రాలకు వచ్చే సరికి యాంత్రిక విన్యాసాలు గ్రాఫిక్కుల ఆర్భాటాలు ఎక్కువయ్యాయి. మర్యాద రామన్నకూ ఈగకూ మధ్యన కూడా అలాంటి తేడానే ఉంటుంది. రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ ఒక కోణంలో గోపాల్, కృష్ణారెడ్డి, కోడి రామకృష్ణ వంటి ప్రముఖ దర్శకులు ప్రతిభావంతులుగా పలుసార్లు నిరూపించుకున్నారు.
కాని వారు తీసుకునే ఇతివృత్తాల రీత్యా చూస్తే దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, టి. కృష్ణ, క్రాంతి కుమార్, మొదట్లో రాఘవేంద్ర రావు వంటి వారి చిత్రాలు ఒరవడి పెట్టేవి కావు. కొందరు హీరోల గత విజయాలు, కుటుంబాల నేపథ్యాలు దృష్టిలో పెట్టుకుని కథలు అల్లుకుని పట్టుగా తీయడానికే పరిమితమయ్యారు. ఈ పరిమితి వారి వ్యక్తిగత లోపం కాదని, ఇప్పటి చిత్ర పరిశ్రమ స్వభావం అలా ఉందని అనిపిస్తుంది. విప్లవాత్మక కథనాలు, సామాజిక సంచలనాలు లేకున్నా కనీసం సామాజిక స్పృహకు దోహదం చేసే కథలైనా తీసుకుంటే కొంత మెరుగు. ఈగ విజయం తర్వాత అలా సాంకేతిక మార్గం పడితే రాజమౌళి వంటి వారిలో ఉన్న కథన కౌశలం పెద్దగా అక్కరకు రాదు.
కనుకనే వారు విజయవంతమైన అదే సమయంలో అర్థవంతమైన చిత్రాలు తీస్తూనే ఉంటారని కోరుకోవాలి. రామ్ గోపాల్ వర్మ లాంటి వారు సరే, పూర్తిగా దారి తప్పిపోగా దిల్‌రాజు వంటి వారు తమవైన ఫార్ములాలు సృష్టించుకున్నారు. ఈ జాబితాలో ప్రస్తావించని మరెందరో ఉన్నారు గాని స్థలం అనుమతించదు. ఉదాహరణకు రచయిత జనార్థన మహర్షి దేవస్థానం పేరిట కొంత ఆధ్యాత్మిక చింతనతో కొంత వాస్తవికతతో ఒక భిన్నమైన చిత్రం తీశారు. ఇలాగే తమ తమ ప్రయత్నాలు చేసే వారు ఇంకా లేకపోలేదు గాని బాగా తక్కువ. ఈ నేపథ్యంలో కొంత భిన్నమైన చిత్రాలు వరుసగా తీసి మెప్పించిన వ్యక్తి శేఖర్ కమ్ముల.
ఆయన ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి ఆహ్లాదకరంగా నడిచాయి. హ్యాపీడేస్ ఘన విజయం కూడా సాధించి పలువురు కొత్త తారలను పరిచయం చేసింది. ఆయనే తర్వాత లీడర్ తీసి రాజకీయ సందేశం అందించే ప్రయత్నం చేశారు. దాన్ని చాలా మంది మెచ్చుకున్నారు గాని అందులో సందేశానికి ఎంచుకున్న మార్గం ఏమంత వాస్తవికమైంది కాదు. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేదీ కాదు. నిజానికి ఆ సమయంలో ఆ విధమైన కథ ఎందుకు తీశారనేది కూడా చాలా చర్చ అయింది.
శేఖర్ కమ్ముల తీసిన చిత్రాలన్నీ మొదటి నుంచి ఉన్నత మధ్య తరగతి వారి ఆనందానికి ఉద్దేశించినవే. హ్యాపీడేస్‌లో యువతను చూపించడం వల్ల మరింత అదనపు ప్రచారం లభించింది. ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే కొత్త చిత్రంతో వస్తున్న శేఖర్ లీడర్‌లో తాను ఇచ్చిన సందేశం ప్రేక్షకులపై పనిచేయలేదు గనుక తాను తిరిగి స్వంత మార్గానికి వెళుతున్నట్టు ఇటీవల ఎక్కడో సూచనగా చెప్పారు. అలా ఒక చిత్రంతోనే మార్పు వస్తే లోకం ఇలా వుండేదేనా? సొంత ఊరు, గంగ పుత్రులు వంటి చిత్రాలు కూడా సరళీకరణ విధానాల ప్రభావాన్ని ప్రతిబింబించాయి గాని పెద్దగా విజయం సాధించలేకపోయాయి.
శేఖర్ తీసిన ఆనంద్ లాగే ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి కూడా విలక్షణ చిత్రాలుగా మన్నన పొందాయి. ఈ రెంటిలోనూ రాజేంద్ర ప్రసాద్ నాయకుడు కావడం ఒక ప్రత్యేకత. హాస్యాన్ని అవలీలగా పండించే రాజేంద్ర ప్రసాద్ పెద్దరికాన్ని గాంభీర్యాన్ని కూడా అలవోకగా అభినయించి ఆర్ద్రత నింపిన చిత్రాలవి. యువ దర్శక నిర్మాత క్రాంతి మాధవ్ తొలి ప్రయత్నంగా ఆయనతో అందించిన ఓనమాలు కూడా ఈ వరవడికి కొనసాగింపుగా కనిపిస్తూనే అంతకన్నా సమగ్రమైన ఆశావహమైన భావోద్దీపన కలిగిస్తుంది. వర్తమాన యుగంలో వక్రధోరణులనూ అక్రమాలను అనౌచిత్యాలనూ చూసినప్పుడు కలిగే ఆవేదనకు తెర రూపం అనిపిస్తుంది.
స్వదేశాగమనాన్ని ఏళ్లతరబడి వాయిదా వేస్తున్న కొడుకుతో పోట్లాడలేక తనకు తానుగానే బయలుదేరిన మంచి మాష్టారు నారాయణరావు మధుర జ్ఞాపకాలతో స్వగ్రామం చేరుకోవడం ప్రథమార్థమైతే ఆయన ప్రతిస్పందన ద్వితీయార్థం. పల్లెల్లో ఒకనాటి ఆత్మీయ సంబంధాలు, కుల మత ప్రసక్తి లేని అన్యోన్యతలు, బడి పిల్లల సహజ సిద్ధమైన ఆటలు అసూయలు, దాంపత్య జీవితపు సరదాలు, జాతరలు, ఆచారాలు, పశుగణాలతో అనుబంధాలు, కుర్రకారు హుషార్లు, మొదటి భాగంలో నడుస్తాయి.
చొచ్చుకు వచ్చిన ప్రపంచీకరణ విష సంస్కృతి ప్రభావాలు, విషాదమైన పల్లె జీవిత చిత్రాలు, ఛిద్రమైన మానవీయ సంబంధాలు, రివాజుగా మారిన అవినీతి అక్రమాలు, సంఘర్షణలో చిక్కిన కొత్తతరం తప్పటడుగులు, నిరాదరణకు గురైన పెద్దతరం నిర్వేదాలు, సెల్‌ఫోన్లు, మినరల్ వాటర్లు ఇవన్నీ ద్వితీయార్థంలో ఉంటాయి. నారాయణరావు శిష్యుల్లో పాఠాలు చెప్పే సరళ, నిబద్ద పాత్రికేయుడుగా నిలబడిన ఖాదర్, స్కీముల స్కాముల్లో చిక్కుకుపోయిన రామకృష్ణ, ఊరి సర్పంచ్ పీఠం డబ్బుతో గెలిచిన సురేష్, వ్యవసాయ సంక్షోభానికి ప్రాణాలిచ్చిన రైతు చిట్టిరాజు తదితరులుంటారు.
చలించి పోయిన నారాయణరావు తన విద్యార్థులందరినీ రప్పిస్తాడు. ఎవరు ఎంత ఎదిగినా పల్లెను తల్లిని మరిచిపోరాదనే సందేశంతో కళ్లు తెరిపిస్తాడు. చిత్రంలో ప్రతివారూ ఏదో ఒక సన్నివేశంలో సంభాషణలో తాదాత్మ్యం చెందకుండా ఉండరు. 1992ను ఈ తేడాలకు కొలబద్దగా తీసుకుని నాటి విద్యార్థులను రప్పించడంలో సరళీకరణ గురించిన స్పృహ ఉంది. నూటికి నూరు పాళ్లు రాజేంద్ర ప్రసాద్ చిత్రం అంటే సరిపోతుంది. కాని క్రాంతి మాధవ్ తొలి ప్రయత్నం గనక దర్శక నిర్మాతగా ఆయననూ ప్రత్యేకంగా అభినందించాలనిపిస్తుంది.
నిజానికి ఇందులో కథకన్నా వివిధాంశాల కూర్పు ఎక్కువ. కళాత్మక కథాత్మక ప్రమాణాల గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా నేటి మన తెలుగు సినిమా వాతావరణంలో ఓనమాలు ట్యాగ్‌లైన్ పెట్టుకున్నట్టే మంచి జ్ఞాపకం అవుతుంది. ఇప్పుడు మళ్లీ ఈగ దగ్గరకు. తెలుగు వారి ఇల్లలికిన ఈగ కథ చిరకాలంగా చెప్పుకుంటూనే ఉన్నారు. అది తన పేరు మరిచిపోయి పరిభ్రమిస్తుంది. తెలుగు సినిమా కూడా అలాగే మూలాలను బలాలనూ మరిచిపోయి కొన్ని గీతల్లో గిరిటీలు కొడుతున్నది. దూకుడు, గబ్బర్ సింగ్ వంటివి ఘన విజయం సాధించలేదని ఎవరూ అనరు గాని దాంతోనే ఏ మేరకు భద్రత భరోసా లభించాయనే ప్రశ్న ఉండనే ఉంటుంది.
కొత్త ప్రయత్నాలు ప్రయోగాలను ఆదరించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నా తమపై తమకే సందేహం ఉన్న ప్రముఖులు ఆ మాత్రం అడుగేయలేకపోతున్నారు. సమస్య ఏమంటే కోటానుకోట్లు పెట్టి తీసిన ఫార్ములా చిత్రాలు బోల్తా పడినా మళ్లీ వాటి వెంటే పరుగులు పెడుతుంటారు గాని సమాంతర ధోరణిలో తీసిన చిత్రం ఒకటి విఫలమైతే మొత్తం అలాంటి వాటికే ఎసరు పెడతారు. ఇలాంటప్పుడే ఈగ మళ్లీ తన పేరు గుర్తు చేసుకుని ఓనమాలు దిద్దుకోవలసిన అవసరం కనిపిస్తుంది. హిందీ, తమిళ భాషలలో జరిగే పాటి ప్రయోగాలైనా మనం చేసేందుకు ఈ విజయాలు ప్రేరణనిస్తే ఆనందించవచ్చు. ఇటీవల జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలలోనూ చిన్న నిర్మాతలే విజయం సాధించారంటున్నారు గనక కొన్ని మంచి ప్రయత్నాలకు ప్రోత్సాహం లభిస్తుందేమో చూడాలి. ఒకప్పుడు అలజడి చిత్రంతో ఆకర్షించినా ఇటీవల అలజడి 2 తీస్తానని ప్రకటించిన తమ్మారెడ్డి భరద్వాజ వంటివారు అందుకు చొరవ తీసుకుంటే అందరూ హర్షిస్తారు.
- తెలకపల్లి రవి
0 comments :
Post a Comment